బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు –జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్: ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల్లో నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి...

కరీంనగర్:
ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల్లో నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఆర్ అండ్ బి, పోలీస్, రవాణా, ఆర్టీసీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో జిల్లా రోడ్డు భద్రత కమిటీ, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ గత రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలు ఏమిటని రవాణా, పోలీస్, రోడ్లు భవనాలు, మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్ లను గుర్తించి రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాద ప్రదేశాలలో సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద అవకాశం ఉన్న స్థలాల్లో వాహనాల వేగ నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్న చోట్ల వాటికి గల కారణాలను విశ్లేషించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నేషనల్ హైవే అథారిటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్, రోడ్లు భవనాలు, రవాణా అధికారులు రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ లో చర్చించిన అంశాలపై, ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ కరీంనగర్- జగిత్యాల రోడ్డుకు ఇరువైపులా ఆరు అడుగుల మేర చదును చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని పలుచోట్ల స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక సైన్ బోర్డులు, లైటింగ్ తదితర ఏర్పాట్లు అవసరం ఉన్నాయని, తాము సూచించిన ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను, అక్కడ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను గురించి వివరించారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ గత సమావేశంలో చర్చించిన విధంగా నగరంలో అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, సోలార్ లింకింగ్ సిస్టం వంటివి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ కీర్తి భరద్వాజ్ మాట్లాడుతూ జాతీయ రహదారి 563లో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలను గురించి వివరించారు.ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం, ఆర్టీసీ డిఎం సునంద, ఏసీపీ వెంకటస్వామి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.