42 కోట్లు రికవరీ చేయండి.. వివాదంలో శంకర వరప్రసాద్ కలెక్షన్లు.. హైకోర్టులో పిటిషన్
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. సంక్రాంతి కానుకగా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాకు తొలి వారంలో ప్రేక్షకుల...

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. సంక్రాంతి కానుకగా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాకు తొలి వారంలో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. పండగ సెలవులు, చిరంజీవి క్రేజ్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో భారీ వసూళ్లు నమోదయ్యాయి. రెండో వారంలోకి అడుగుపెట్టాక, అదే జోరు కొనసాగుతోంది. ఇలా విజయవంతం రన్ అవుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా వివాదంలో చిక్కుకుంది. ఇంతకీ ఏమైందంటే.?
మన శంకర వరప్రసాద్ గారు టికెట్ రేట్ల పెంపు వ్యవహారం ఇప్పుడు న్యాయస్థానానికి చేరి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా పెంచిన టికెట్ ధరల ద్వారా అక్రమంగా రూ.42 కోట్ల వరకు వసూలు చేశారని ఆరోపిస్తూ, ఆ మొత్తాన్ని తిరిగి రికవరీ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను న్యాయవాది పాదూరి శ్రీనివాసరెడ్డి వేశారు. పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఒక మెమో జారీ చేసి, సినిమా టికెట్ ధరలను పెంచేందుకు అనుమతి ఇచ్చారు. ఆ మెమో ప్రకారం ప్రత్యేక షోలకు టికెట్ ధరను రూ.600గా నిర్ణయించగా, వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో ఒక్కో టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 వరకు అదనంగా వసూలు చేశారు. ఈ నిర్ణయంతో భారీగా ప్రజలపై ఆర్థిక భారం పడిందని, అదే సమయంలో నిర్మాతలు, థియేటర్ యాజమాన్యానికి అన్యాయమైన లాభం చేకూరిందని పిటిషనర్ తన వాదనలో పేర్కొన్నారు.ఇప్పటికే టికెట్ రేట్ల పెంపు విషయంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, వాటిని ఉల్లంఘిస్తూ ప్రభుత్వం ఈ మెమో జారీ చేసిందని పిటిషన్లో ఆరోపించారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు రూ.42 కోట్ల వరకు అక్రమ వసూళ్లు జరిగాయని, కనుక ఆ మొత్తాన్ని వెంటనే రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై ప్రాథమిక విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు, ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించింది. టికెట్ రేట్లు పెంచడం ద్వారా వచ్చిన మొత్తం ఎంత, ఆ వసూళ్లు ఎలా జరిగాయి, వాటిపై జీఎస్టీ చెల్లింపులు సక్రమంగా జరిగాయా లేదా అనే అంశాలపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే జీఎస్టీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.అదే సమయంలో ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సంబంధిత అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ విచారణలో ప్రభుత్వ వివరణతో పాటు జీఎస్టీ అధికారుల నివేదిక కీలకంగా మారనుందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
No Comment! Be the first one.