బాలల హక్కులు, చట్టాలపై విస్తృత అవగాహన కల్పించాలి –సర్పంచుల శిక్షణలో బాలల హక్కుల అంశాన్ని చేర్చాలి –బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి
కరీంనగర్ బాలల హక్కులు, చట్టాలపై ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి అన్నారు.తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్...

కరీంనగర్
బాలల హక్కులు, చట్టాలపై ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి అన్నారు.తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డితో పాటు ఐదుగురు సభ్యులు మర్రిపల్లి చందన, బి.అపర్ణ, గోగుల సరిత, ప్రేమలతా అగర్వాల్, బి.వచన్ కుమార్ శుక్రవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించారు.
ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని పిల్లల వార్డు, ఎన్ఐసీ కేంద్రం, మాతా శిశు కౌన్సిలింగ్ సెంటర్ సందర్శించారు. చింతకుంట అంగన్వాడి కేంద్రంలో నిర్వహిస్తున్న శుక్రవారం సభకు కమిషన్ సభ్యులు హాజరయ్యారు. కరీంనగర్ సఖి కేంద్రం, సప్తగిరి కాలనీలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని, ప్రభుత్వ అంధుల, బధిరుల ఆశ్రమ పాఠశాలలను సందర్శించారు. చింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రేకుర్తిలోని మైనారిటీ వెల్ఫేర్ స్కూల్ పరిశీలించారు.
అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో తల్లిపాల బ్యాంకు అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అంధులు, బధిరుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు తమకు రావలసిన దివ్యాంగుల పింఛను కోసం వారి వారి గ్రామాలకు వెళ్లకుండా ఇక్కడే పింఛన్ పొందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెరగడం మంచి విషయమని తెలిపారు. అయితే సిజేరియన్ శాతాన్ని సాధ్యమైన మేర తగ్గించాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో రోడ్డు భద్రత అంశాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రతి అంగన్వాడి కేంద్రంలో విద్యుత్ సరఫరా తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. పాఠశాలలు, అంగన్వాడీలు, హాస్టళ్లకు దోమల నియంత్రణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో వలస కార్మికుల పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహించటం మంచి విషయమని, క్షేత్రస్థాయిలో మరింత మందిని గుర్తించి ఈ స్కూళ్లలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లలు లేని దంపతులు, రక్తసంబంధీకులనుండి దత్తత తీసుకునే వారికి చట్టబద్ధమైన దత్తతపై అవగాహన కల్పించాలని అన్నారు. సఖి కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వారికి మహిళా చట్టాల పట్ల అవగాహన కల్పించాలని తెలిపారు. సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా బాలల హక్కుల చట్టాల గురించి వివరించాలని, అవసరమైతే బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులను శిక్షణకు ఆహ్వానించాలని తెలిపారు.
ఈ సమావేశంలో సిడబ్ల్యుసి చైర్పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి, డిసిపిఓ పర్విన్, విద్యాశాఖ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంపత్, డిహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ శ్రీలత, సఖి అడ్మిన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.