పదిలో నూరు శాతం ఫలితాలు టార్గెట్ – – ప్రత్యేక తరగతుల నిర్వహణలో అలసత్వం చేయొద్దు విద్యాశాఖ సమీక్షలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ పదో తరగతి విద్యార్థులు నూరు శాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ప్రత్యేక అధికారులు దృష్టి పెట్టాలని, ప్రత్యేక తరగతుల నిర్వహణలో అలసత్వం...

కరీంనగర్
పదో తరగతి విద్యార్థులు నూరు శాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ప్రత్యేక అధికారులు దృష్టి పెట్టాలని, ప్రత్యేక తరగతుల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.కలెక్టరేట్ ఆడిటోరియంలో పదవ తరగతి పరీక్షల సన్నాహక సమావేశం విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగింది. ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ప్రత్యేక అధికారులు, కేజీబీవీ, మోడల్, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ లు ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఏ విద్యార్థికీ సెలవు ఇవ్వరాదని ఆదేశించారు. అన్ని పాఠశాలలు, కేజీవీబీలు, గురుకులాలు, మోడల్ స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి పదవ తరగతి పాస్ అవ్వడమే లక్ష్యంగా సమిష్టి కృషి చేయాలని తెలిపారు. చదువులో వెనుకబడిన పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ఆ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ప్రోత్సహించాలని అన్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణలో అలసత్వం వహించినా, ప్రత్యేక అధికారులు పాఠశాల సందర్శనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.స్నేహిత ఫిర్యాదుల పెట్టెల తాళాలు మహిళా పోలీసులకు అప్పగించాలని ఆదేశించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల అవసరాలకు నివేదిక సమర్పించాలని అన్నారు.అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాధికారి అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ ఇంకా సిలబస్ పూర్తికాని పాఠశాలలు ఉంటే వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పదవ తరగతి విద్యార్థుల సన్నద్ధత ప్లానింగ్ లో ఉన్న అంశాలను ఆయా పాఠశాలలు అమలు చేస్తున్నదీ లేనిదీ ప్రత్యేక అధికారులు తనిఖీ చేయాలని అన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి పెట్టాలని తెలిపారు.ఈ సమావేశంలో డిసిఇబి కార్యదర్శి భగవంతయ్య, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No Comment! Be the first one.